జ్ఞానం శీలం ఏకతరా..
పరిషతోళ్ళ ప్రత్యేకతరా..
జ్ఞానం
తాతలనాడు నేతులు తాగితే మూతులునాక పోదమంటరు
పాతకాలపు మతాల రోతలు వంటికి పులుముకు ఎగురుదమంటరు
రాచరికాలే రక్ష కవచమని రంకెలేసుకుని పోదమంటరు
జ్ఞానం
హిందూమతాన్ని మించిన ధర్మం లేదంటూ పెద్ద గోల చేస్తరు
బౌద్ధుల చెవుల్లో సీసం పోసిన శంకరచార్యుడె గురువు అంటరు
చార్వాకులను జాబిలి మునిని చంపిన మతము ఎట్లా గొప్పది
హిందూమతాన్ని కాదని అంటె కత్తులు దూసి కవాతు చేస్తరు
జ్ఞానం
ఐన్ స్టీన్ సిద్ధాంతాలు అద్వైతంలో ఉన్నయంటరు
డార్విన్ గారి సిద్దాంతాలు దశావతారం అంటువుంటరు
రాజులు ఏలిన రక్కసి పాలన రంజుగ ఉందని చెబుతువుంటరు
జ్ఞానం పేర అజ్ఞానాన్ని బోధించంగ బైలుదేరిరి..
జ్ఞానం
అంతరాత్మను శుద్ధిని చేసి వ్యక్తిత్వాన్ని పెంచమంటరు
స్త్రీలందరికి గౌరవిమిస్తూ శీలవంతులు కావాలంటరు
దారినిబోయే ఆడవారిని దారులు కాసి బనాయించగ
ఎదురుతిరిగిన ఆడవారిని కొట్టడమట్రా మీ శీలం..
జ్ఞానం
మాతృదేశము ముక్కలయ్యెనని మొసలి కన్నీరు కార్చే మీరు
భారతీయులను మతం పేరిట కులం పేరిట విభజన చేసి
మనలో మనకు గొడవలు పెట్టి మతకల్లోలం సృష్టించారు
ఏకత ఏకత అంటూనే దేశైక్యతకు ద్రోహం చేసిరి
జ్ఞానం
సోషలిజం అంటె తెలియని గాంధికి సోషలిజాన్ని అంటగడతరు
భారతీయ తత్వం పేరిట బానిసత్వాన్ని బోధిస్తారు
వ్యక్తి నిర్మూలన వద్దంటారు వ్యక్తి నిర్మాణము కావాలంటరు
జార్జి పాషలను శేషయ్యలను చంపటమట్రా వ్యక్తి నిర్మాణము..
జ్ఞానం
నక్సలైటులే దోశద్రోహులని దేశభక్తులం మేమంటారు
దోపిడిచేసే టాటాబిర్లల ధర్మదాతలని కీర్తిస్తారు
దోపిడి గాళ్ళపై పోరును చేసే నక్సలైటులా దేశద్రోహులు
డబ్బున్నోడి గులాములయ్యే మీరేనటరా దేశభక్తులు?
జ్ఞానం
రష్యా వాడు అప్పులు ఇస్తే దోపిడి దారని చెబుతవుంటరు
అమెరిక వాడు అప్పులు ఇస్తే ఆబ్బా మనకు సహాయమంటరు
నరహంతకుడు నాజి హిట్లర్ ఆదర్శం అని అంటు వుంటరు
వందేమాతరమంటూనే విదేశాలకు అమ్ముడుపోతరు
జ్ఞానం
విప్లవ భావాలు నేర్చెదమంటె విదేశీయమని గోల చేస్తరు
విదేశీయుల శాస్త్రజ్ఞానము బొట్టులు పెట్టి చదువదమంటరు
ప్రపంచ ప్రజలు ఒక్కటి అంటె దేశద్రోహమని నిందవేస్తరు
నిజం చెబితె విదేశితొత్తట దేశభక్తి వీడబ్బ సొత్తట..
జ్ఞానం
బూజు పట్టిన మీ భావాలకు కాలం చెల్లే రోజొచ్చింది
మానవత్వాన్ని మంటలొ కలిపే అన్ని మతాల సారమొక్కటే
సమ సమాజపు పునాదులే మీ సమాధులయ్యే గడియొచ్చింది..
జ్ఞానం 12/1/1983
No comments:
Post a Comment