Friday, October 29, 2010

నేనెట్టా బతికేది.. నేనెట్టా చచ్చేది..


మాయదారి చచ్చినోళ్లు
మాయ రోగమొచ్చినోళ్లు
పిచ్చి పట్టి తిరుగుతుండ్రు సాంబో నేనెట్టా
నేనెట్టా బతికేది బాబు సాంబో నేనెట్టా.

ఫుల్లుగున్న బస్సులోన
పిల్లిలాగ దూరిదూరి
ఏడేడో తాకుతుండు సాంబో నేనెట్టా
నేనెట్టా మసిలేది బాబు సాంబో నేనెట్టా

హవుసు ఫుల్లు హలులోన
సైడు సీటు దొరకబట్టి
బరుకు బరుకు గొకుతాడు సాంబో నేనెట్టా
నేనెట్టా చూసేది బాబు సాంబో నేనెట్టా.

గల్లి చివర మోరి కాడ
గుట్క నోట్లో ఏసుకొని
తుపుకు తుపుకు ఉమ్ముతుండు సాంబో నేనెట్టా
నేనెట్టా ఎల్లేది బాబు సాంబో నేనెట్టా.

ఏలెడంత పోరగాడు
స్టైల్‌గా సిగరెట్టు తీసి
గుప్పు గుప్పు ఊదుతుండు సాంబో నేనెట్టా
నేనెట్టా ఏగేది బాబు సాంబో నేనెట్టా.

ఎంసెట్‌లో సీటు వచ్చి
బీటెక్‌లో చేరబోతే
రింగురింగు రాగింగు సాంబో నేనెట్టా
నేనెట్టా చదివేది బాబు సాంబో నేనెట్టా.

రంగురంగు సిస్టంలో
ఫీడింగు చేస్త వుంటే
తొంగి తొంగి చూస్తడేంది సాంబో నేనెట్టా
నేనెట్టా చేసేది బాబు సాంబో నేనెట్టా.

బాత్రూము పబ్లికాయె
బెడ్రూము పబ్లికాయె
బొక్కబొక్కలో కెమెరా సాంబో నేనెట్టా
నేనెట్టా చచ్చేది బాబు సాంబో నేనెట్టా.

వంటి నిండ చీర ఉన్న
సగం ఫాన్సి డ్రస్సు అయిన
చూపులే సూదూలు ఆయే సాంబో నేనెట్టా
నేనెట్టా వుండేది బాబు సాంబో నేనెట్టా.

బూతు జోకు లేత్తవుండ్రు
రోత మాట లాడుతుండ్రు
నరం లేని నాలికోళ్లు సాంబో నేనెట్టా
నేనెట్టా పలికేది బాబు సాంబో నేనెట్టా

స్కూటి మీద ఎల్తు ఉంటే
ఓవర్‌ టేకు సడన్‌ బ్రేకు
సీటి గొట్టి సంపుతుండ్రు సాంబో నేనెట్టా
నేనెట్టా నడిపేది బాబు సాంబో నేనెట్టా.

వేగుచుక్కా.. వేగుచుక్కా...

వేగు చుక్క... వేగు చుక్కా..
ఇండియాకే వేగుచుక్కా...
ఏయ్..అరరే
వేగుచుక్కా.. వేగుచుక్కా.. వేగుచుక్కా..
వేగుచుక్కా.. వేగుచుక్కా..వేగుచుక్కా..


పుణ్యాలే పంచిపెట్టే
తిరుపతి.. కాళహస్తి..
అన్నవరం..శ్రీశైలం...
కాళేశ్వరం..భద్రాచలం
పాపాలే తుడిచిపెట్టే
భట్టిప్రోలు.. కొలనుపాక
అలంపూరు..బాసర
కడపదర్గా...గుణదల


ఏయ్...తొడగొట్టి సంకెళ్లే
తెంచుకున్న వీరులు
సమ్మక్క...సారక్క
ఉయ్యాలవాడ...అల్లూరి
కన్నెగంటి...కొమరం భీమ్
కొమరయ్య...సుందరయ్య
అయ్యదేవర...గాడిచర్ల
ఐలమ్మ...గరిమెళ్లా


జబ్బచరిచి నిలుచున్న
హైదరాబాదు..విజయవాడ
వైజాగు...కాకినాడ
వరంగలు...కర్నూలు
మంచిబుద్ది మనకిచ్చిన
వేమన్నా..గురజాడా
కాటన్ దొర..మోక్షగుండం
వావిలాల...కాళోజీ


కోలాటం...కూచిపూడి
ఒగ్గుకథ...బుర్రకథ
బతుకమ్మ...తప్పిటగుళ్లు
గొండుకోయ థింసాలు


అన్నపూర్ణ మన వరి
గట్క...రాగిసంకటి
జొన్న..సజ్జ..మొక్కజొన్న
పల్లీలు...చెరకుగడ


జీవనదులు మనసిరి
గోదావరి...కృష్ణమ్మా
వంశధార...నాగావళి
తుంగభద్ర...పెన్నదిండి


తరగని గని నేలతల్లి
కేజి బేసిన్...సింగరేణి
పాపికొండలు..దక్కను
కోలారు..నల్లమల


Friday, October 15, 2010

మేమే.. ఇండియన్స్..


తికమక పెట్టే అమాయకత్వం..
చకచకలాడే వేగం..
అలాగ ఉంటాం.. ఇలాగ ఉంటాం..
ఆకతాయిలం మేము..
అరే చెప్పేదేదో సమజ్ అయ్యేట్టు చెప్పరా..
అట్లనే చెప్తా.. వినుకో..
 

పల్లవి:
సత్యం పలికే హరిశ్చంద్రులం..
అవసరానికో అబద్ధం..
నిత్యం నమాజు పూజలు చేస్తాం..
రోజు తన్నుకు చస్తాం..
నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం..
నమ్మడమేరా కష్టం..
ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం..
నచ్చకుంటే మీ ఖర్మం..
అరె.. కష్టమొచ్చినా కన్నీరొచ్చినా
చెదరని నవ్వుల ఇంద్రధనస్సులం..
మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..

చరణం-1
వందనోటు జేబులో ఉంటే నవాబు నైజం
పర్సు ఖాళి అయ్యిదంటే ఫకీరు తత్వం
కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం
పడుచుపిల్ల ఎదురుగ వస్తే పళ్ళికిలిస్తాం..
ప్రేమ.. కావాలంటాం..
పైసా.. కావాలంటాం..
ఏవో కలలే కంటాం..
తిక్క తిక్కగా ఉంటాం..
ఏడేళ్ళయినా టీవి సీరియల్ ఏడుస్తూనే చూస్తాం..
తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం..
కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడి కోటేస్తాం..
అందరు దొంగలే అసలు దొంగకే సీటు అప్పచెప్పేస్తాం..
రూలూ ఉంది..
రాంగూ ఉంది..
తప్పుకు తిరిగే లౌక్యం ఉందీ..
మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..

చరణం-2
కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో..
ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో..
శత్రువుకే ఎదురు తిరిగిన రక్తం మనది..
ద్వేషాన్నే ప్రేమగ మార్చిన దేశం మనది..
ఈశ్వర్ అల్లా ఏసు..
ఒకడే కదరా బాసు..
దేవుని  కెందుకు జెండా..
కావాలా పార్టీ అండా..
మాతృభూమిలో మంటలు పెట్టే మాయగాడి కనికట్టు..
అన్నదమ్ములకు చిచ్చును పెట్టే లుచ్చాగాళ్ళ పని పట్టు..
భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయి ఒట్టు..
 మరోసారి ఇటు చూసే ద్రోహుల తోలు తీసి ఆరెట్టు..
దమ్మే ఉంది..
ధైర్యం ఉంది..
తలవంచని తెగ పొగరే ఉంది..
మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..

వందేమాతరం


సాహసం శ్వాసా..
ఓటమే పాఠం..
విజయమే వెన్ను చూపని
చెక్కుచెదరని లక్ష్యం..
స్వేచ్ఛేగా స్వర్గం..
సాధించు స్వప్నం..
వసంతం వాడవాడలా
పంచి పెట్టాలి నేస్తం..
ఈ ప్రజలే.. ప్రాణం..
ఈ ప్రేమే.. గమ్యం..
తలే ఎత్తుకో.. ఓ ఓ..
అలై సాగిపో.. ఓ ఓ..
కలం సైన్యమై కవాతు చెయ్యి
మనదేరా ఇండియా..
జయ జయ జయహే.. హే హే..
వందేమాతరం.. హే హే..
జయ జయ జయహే.. ఇండియాకే..
జయగీతిక పాడరా..

అహింసే ధ్యేయం..
సత్యమే మార్గం..
దేశమే మరువలేదులే
బాపు సత్యగ్రహ మంత్రం..
విదేశీ భూతం..
వదల లేదింకా..
అమరుల ఆత్మత్యాగము
వృధా కాదు కానీయం..

నదులు కడలి.. మాదే..
వనులు గనులు.. మావే..
నేలై లేవాలి.. ఓ ఓ..
గాలై వీయాలి.. ఓ ఓ..
శాంతి సైన్యమై శపధం చేయ్యి..
మనదేరా ఇండియా..
జయ జయ జయహే.. హే హే..
వందేమాతరం.. హే హే..
జయ జయ జయహే.. ఇండియాకే..
జయగీతిక పాడరా..

ఏయ్‌.. మానవజాతికి పురుడే పోసిన గోండ్వానా..
ఏయ్‌.. సింధు లోయలో జిందగి నేర్చిన
ఇండియానా..
శంభో..
బుద్ధా..
జయ జయ జయహే.. ఇండియాకే..
జయగీతిక పాడరా..

అల్లా..
జీసస్‌..
జయ జయ జయహే.. ఇండియాకే..
జయగీతిక పాడరా..

జయ జయ జయహే.. హే హే..
వందేమాతరం.. హే హే..
జయ జయ జయహే.. ఇండియాకే..
జయగీతిక పాడరా..

Thursday, October 14, 2010

ఈ శిల్పులెవ్వరో..

ఈ శిల్పులెవ్వరో..
ఈ కూలీలెవ్వరో..
పేరులేనోళ్ళు.. ఘనకీర్తి గలవాళ్ళు..

అజంతా ఎల్లోరా అమరావతి చూడు
ఓరుగల్లు హంపి విజయనగరం చూడు
మొహంజదారో హరప్పా చూడు
ఏదేది చూసినా తోచేది ఒక్కటే..
                        .. ఈ శిల్పులెవ్వరో

బండరాళ్ళను వెన్నపూసగా చేసి
అందచందాలున్న బొమ్మలుగ మలిచి
నాజూకు నాజూకు నగీషిలు చెక్కి..
రక్తాన్ని శిల్పముకు రంగుగా రాసిన..
                        .. ఈ శిల్పులెవ్వరో

రాళ్ళనే మీటి రాగాలు పలికించి
రాతిబొమ్మల చేత భావాలు చెప్పించి
హావభావాలలో జీవకళలొలికించి
ప్రాణాలనే బోసి ప్రతిమలుగ చేసిన
                        .. ఈ శిల్పులెవ్వరో

శ్రీకృష్ణరాయలు రాణి రుద్రమదేవి
ఏ రాజు ఏ రాణి ఎవరు కట్టించినా
కీర్తి రక్షణ కొరకు కోటలను గడితే
కండ కోసి కోట రాళ్ళుగా పేర్చిన
                        .. ఈ శిల్పులెవ్వరో

భాష్యాలు చెప్పే భావనా చిత్రాలు
వెనక చరితను చాటే వెలలేని రత్నాలు
అఖిల భారతదేశ మలరించు శిల్పాలు
ఊరూరునా కళల పేరు మ్రోగించిన                   
                           .. ఈ శిల్పులెవ్వరో