Thursday, March 22, 2012

కొమ్మల్లో కూచున్న కోయిలా

కొమ్మల్లో కూచున్న కోయిలా
నువ్వు కూ అంటూ కూయవేమే కోయిలా
మన పల్లెకు పండగొస్తే కోయిలా
నువ్వు పాడుకుంటు అడవేమే కోయిలా..

గున్నమావి కొమ్మ మీద కోయిలా
నీ కన్ను పడ్డదేమిటమ్మా కోయిలా
ఆ లేత చిగురు తింటెగాని కోయిలా
నీ కూతకింత పదును రాదా కోయిలా

చిగురు తింటె తిన్నవమ్మ కొయిలా
ఈ మాటకైనా బదులు చెప్పు కోయిలా
చిగురులోన వగరు ఏంది కోయిలా
మన తోటమాలి చెమట కాదా కోయిలా

మళ్ళు కట్టి దళ్ళు కట్టి కోయిలా
మావిళ్ళ తోట పెంచి కోయిలా
పండుకైన నోచుకోని కోయిలా
పండు ముసలి వాడు తల్లీ కోయిలా

నారు పోసి నీరు పోసి కోయిలా
మరి ఊరు పేరు లేని వాడే కోయిలా
ఆ తోటమాలి తాత మీద కోయిలా
ఓ పాట కట్టి పాడవమ్మా కోయిలా..

ఉత్తరాన తోటలోన కోయిలా
నా రత్తనాల పక్షివమ్మా కోయిలా
ఈ కొత్తపాట పాడుకుంటూ కోయిలా
నువ్వు మొత్తమొత్త తిరిగిరావే కోయిలా..

Thursday, March 15, 2012

గుండె వెలుగూ గౌతముడే.. - శక్తి

దేవుడే లేడన్న దేవుడు ఎవరే
మనిషే దేవుడన్న మహనీయుడెవరే
గుండె వెలుగూ గౌతముడే.. బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..
 
దుఃఖించే లోకాన ఓదార్పు తానే
కోరికను గెలిచే తపస్సు తానే..
గుండె వెలుగూ గౌతముడే.. బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..

కారణం లేకుండా జరగదు ఏదీ..
అది తెలుసుకుంటే జ్ఞానమే నీదీ..
గుండె వెలుగూ గౌతముడే.. బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..

నిన్న నేడు రేపు ప్రతి క్షణము మార్పు
తుది మొదలు లేనిది కాలమన్నాడే..
గుండె వెలుగూ గౌతముడే.. బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..

సోమరి తనము చావుకు వరము
శ్రమ జేసే మనిషికి చావు లేదన్నా..
గుండె వెలుగూ గౌతముడే.. బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..

బహుజనుల హితము బహుజనుల సుఖము
కులమన్నదే లేని మతము మనదన్నా..
గుండె వెలుగూ గౌతముడే.. బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..

అష్టాంగమార్గాన దీక్షనే ఇచ్చి..
స్త్రీ పురుషులంతా సమానమన్నా..
గుండె వెలుగూ గౌతముడే.. బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..

అంతము లేనిది జ్ఞానమే అన్నా..
సొంతాస్తి మనజాతి అంతానికన్నా..
గుండె వెలుగూ గౌతముడే.. బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..

సంఘమే గమ్యం ధర్మమే మార్గం
నీకు నువ్వే తప్ప గురువు లేడన్నా..
గుండె వెలుగూ గౌతముడే.. బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..

ఈ జన్మ తప్ప మరు జన్మ లేదు
అంతరాత్మ తప్ప ఆత్మ లేదన్నా..
గుండె వెలుగూ గౌతముడే.. బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..

జ్ఞానాన్ని పంచి చెడునంత కడిగి
ప్రేమతో ప్రపంచమే గెలవమన్నా..
గుండె వెలుగూ గౌతముడే.. బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..

దేవుడే చెప్పినా.. నేను చెప్పినా..
రుజువు కాని మాట నిజము కాదండే..
గుండె వెలుగూ గౌతముడే.. బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..
(గౌతముడు బుద్ధుడిగా పరిణామం చెంది 2600 సంవత్సరాలు అయిన సందర్భంలో)