Tuesday, April 24, 2012

శివుడో సాగరుడా


నల్ల నల్ల సూరీడా శివుడో సాగరుడా
సల్లని చూపులోడా  శివుడో సాగరుడా
చిరుచిరు నవ్వులోడా శివుడో సాగరుడా
ఉద్యమాల నెలబాలుడా శివుడో సాగరుడా
“నల్ల నల్ల సూరీడా”

విప్పపూల చెట్లమీది శివుడో సాగరుడా
విల్లమ్ములిస్తివయ్యా శివుడో సాగరుడా
తోటరాముడి త్యాగం శివుడో సాగరుడా
పాట గట్టి రాస్తివయ్యా శివుడో సాగరుడా
గంగదాటే చెల్లెమ్మల కంట నీరు తుడిచినోడా..
పేదలకై పోరినోడా.. నిరుపేదగ నిలిచినోడ..
“నల్ల నల్ల సూరీడా”


కారంచేడు కావరంపై శివుడో సాగరుడా
కన్నెరజేసినోడా శివుడో సాగరుడా
చుండూరు దళితులతో శివుడో సాగరుడా
దండుగట్టి సాగినోడా శివుడో సాగరుడా
విప్లవ బ్రాహ్మన్యపు వంటకాల రుచి చూసి..
కులముందని చాటినోడా ఎద్దు కూర ముద్దన్నోడా..
“నల్ల నల్ల సూరీడా” 

మనసులో మాసియాంగు శివుడో సాగరుడా
బుద్ధిలో బుద్ధుడు శివుడో సాగరుడా
చూపులో జ్యోతిబా శివుడో సాగరుడా
చేతలో అంబేద్కర్ శివుడో సాగరుడా
బహుజన విముక్తికై బాటలెన్నో వేసినోడా
సాంస్క్రతిక విప్లవాన్ని సాధించమన్నోడా..

“నల్ల నల్ల సూరీడా” 24/04/2012

Monday, April 16, 2012

కలబడు కూలన్నా..


నిలబడు నిలబడు కూలన్నా
నీ ఎంట నేనొస్తా కూలన్నా..         “నిలబడు”

రెక్కలిరగదీసినోడ    కూలన్నా
రేగల్లు దున్నినోడ        ”
బతుకు బలి చేసినోడ     ”
బంజర్లు సాకినోడ         ”
అరిగోస పడ్డవోడ         ”
అడవుల్ని నరికినోడ     ”
భూసారం పిండి పిండి    ”
బంగారం చేసినోడ        ”           “నిలబడు”

పశువుల్ని గాసెటోడ    కూలన్నా..
పేడకల్లు దీసెటోడ        ”
సావిల్లు వూడ్చెటోడ      ”
సాకిరి జేసెటోడ                ”
దొరలకాడ సేవ జేసి      ”
చేవ చచ్చిపోయినోడ     ”
జీతాని కున్న వోడ       ”
నీ జీవితాన్ని మార్చుకోర        ”           “నిలబడు”

పొట్టెకర్లు పేసుకుని    కూలన్నా..     
చెట్లెన్నో ఎక్కెటోడ        ”
తాడిచెట్టు ఎక్కెటోడ      ”
తాటికల్లు గీసెటోడ        ”
ఈతచెట్టు ఎక్కెటోడ      ”
ఈతకల్లు గీసెటోడ        ”
బట్టెబాజి దొరలంత       ”
లొట్టిదొంగలవ్వబట్టె       ”
కల్లుగీసి అమ్ముకుంటె           ”
ఉప్పుకల్లు రాదురన్నా          ”           “నిలబడు”

కత్తెర్లు ఏసెటోడ           కూలన్నా..   
సవరాలు జేసెటోడ       ”
గడ్డాలు గీసెటోడ          ”
మాలీసు జేసెటోడ        ”
మంగలి పనిజేస్తే          ”
మింగమెతుకు లేదురన్నా      ”
బితుకు బితుకుమంట వేర     ”
బతుకు కొరకు లేచి రార        ”           “నిలబడు”

గొంగడి ఏసుకోని    కూలన్నా..        
గుట్టగుట్ట తిరిగెటోడ      ”
గొర్లను మేపెటోడ         ”
గొతికల్ని అమ్మెటోడ     ”
పాలదుత్త దొరలపాలు            ”
నీకు పేడ ఎత్తిపోతమిగులు      ”
బుర్రమీస మంతవున్న          ”
జర్రపొగరు చూపరాద            ”           “నిలబడు”

ఎండలేదు వానలేదు     కూలన్నా..         
పండగ పబ్బాలు లేవు           ”
అరుసుకునే దిక్కు లేదు        ”
అరవ చాకిరాయె బతుకు       ”
దొరల పెళ్ళి సారమోస్తే           ”
చారునీల్ల కూడె నీకు           ”
రోత బట్టలుతికినా              ”
పాతగుడ్డ ఇవ్వడాయె            ”
చాకిరేవు బట్టలోలె             ”
చచ్చినోల్ల పట్టివుతుకు          ”           “నిలబడు”

గట్టు తవ్వి మట్టి పిసికి    కూలన్నా..
ముద్ద ముద్ద తొక్కటోడ          ”
చెమటలాను గక్కుకుంట        ”
సారెను దిప్పెటోడ        ”
కుండజేసె కుమ్మరన్న           ”
ఓటికుండ బతుకురన్నా         ”
మట్టిలోన వుప్పులాగ                ”
ఈ ఎట్టి బతుకు ఏలరన్నా..             ”           “నిలబడు”

మొద్దును నరికెటోడ    కూలన్నా..           
ముక్కలాను జేసెటోడ          ”
బాడీస పట్టుకుని         ”
గాడీలు దీసెటోడ         ”
చిత్రీలు పట్టెటోడ          ”
చిత్రాలు చెక్కెటోడ        ”
మంచము చేసి ఇస్తే      ”
నీకంచమైన నిండదేరా..         ”           “నిలబడు”

వేడివేడి కొలిమి కాడ    కూలన్నా..
ఉడికి ఉడికి పోయెటోడ          ”
కొడవల్లు జేసెటోడ        ”
కర్రు సాగ దీసెటోడ       ”
ఎంత చేసినా నీకు        ”
చింత తీరదేమిరన్నా     ”
కొలిమిలోని నిప్పువయ్యి        ”
కాల్చాలి దోపిడిని         ”           “నిలబడు”

చర్మాన్ని సాగదీసి    కూలన్నా..
చెప్పులాను కుట్టెటోడ           ”
తోలును పదును చేసి            ”
తొండాలు చేసెటోడ       ”
ఊరివాల్ల పనులు చేస్తే           ”
ఊరవతల గుడిసె నీకు          ”
అంటరాని బతుకు ఏల          ”
కంటనిప్పు చెరగరార                  ”             “నిలబడు”

కులం పేర కట్టు చేసి    కూలన్నా..
మన కట్టుముడి విప్పుతుండ్రు          ”
నీ కులము ఏదైనా       ”
కూడులేని కులం మనది        ”
సర్కారు దొరలు కలిసి           ”
దొంగలయ్యి దోచుకుండ్రు         ”
దోచుకునేటోల్ల పైన       ”
తాచులాగ లేవరన్నా..           ”           “నిలబడు”

కష్టాలు ఓర్చుకోని    కూలన్నా..
కన్నీల్లు తుడ్చుకోని     ”
రికాము లేని చాకిరితో           ”
లోకాన్ని నడుపుతావు          ”
ఎన్ని బాధలున్న గాని               ”
ఎన్నెలోలె నవ్వుతావు           ”
ఎన్న కన్న మెత్తనోడ            ”
గన్నువోలె లేవరన్న     ”
కలబడు కలబడు కూలన్నా..
నీ చేతిలోన కత్తినవుతా కూలన్నా... 11/2/1984

Sunday, April 15, 2012

ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ


ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ
ఇస్సొయ్ ఇస్సోయ్ రంగ..           “ఇస్సోయ్”

పొద్దుటేల సద్దితిని    ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ
ఇల్లు ఇల్లు తిరిగొచ్చి         ”   ”   ”     ”
గుడ్డలన్ని పోగుచేసి          ”   ”   ”     ”
మూటముల్లె కట్టుకొని       ”   ”   ”     ”
సాకిరేవు కెల్లెసరికి తిన్నసద్ది అరిగిపాయె “ఇస్సోయ్”

బట్టలన్ని నానబెట్టి   ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ
సోడనీళ్లు కలియబెట్టి        ”   ”   ”     ”
కట్టెలన్ని మంటబెట్టి          ”   ”   ”     ”
గుడ్డలన్ని ఉడకబెట్టి         ”   ”   ”     ”
బండకేసి బాదుడాయె కండలన్ని పీకుడాయె      “ఇస్సోయ్”

పిల్లగుడ్డ జెల్లగుడ్డ    ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ
అంటుగుడ్డ ముట్టుగుడ్డ      ”   ”   ”     ”
మల్లెలోలె తెల్లగుతికి         ”   ”   ”     ”
ఎన్నెలోలె వన్నెదెస్తె         ”   ”   ”     ”
ఉన్న దొరముండకొడుకు చిన్నపైస యివ్వకుండె “ఇస్సోయ్”

గయ్యాళి దొరసాని    ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ
గంపెడన్ని గుడ్డలేసె          ”   ”   ”     ”
వుతుకుతుంటె పాతబట్ట     ”   ”   ”     ”
సినుగులన్ని సేటలాయె     ”   ”   ”     ”
బలిసినా దొరసాని బూతులెన్నొ కూయబట్టె                “ఇస్సోయ్”

రోజుకుంట రొప్పుకుంట      ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ
రోజువారి గుడ్డలుతికి                 ”   ”   ”     ”
మాపటేల బువ్వకెల్తే                 ”   ”   ”     ”
మాడుముక్క పెట్టబట్టె               ”   ”   ”     ”
ఓర్నీ కూడు పాడు గాను ఆకలన్న తీరదాయె     “ఇస్సోయ్”

నీల్లల్లో కాల్లు నాని   ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ
వొరిసిపాయె సీకిపాయె       ”   ”   ”     ”
రాల్లపైన ఇసుకపైన          ”   ”   ”     ”
కాల్లుగాలి కాయగాసె         ”   ”   ”     ”
దవాఖాన కెల్దమంటె దమ్మిడన్న లేకపాయె               “ఇస్సోయ్”

ఎండలోన ఎండుడాయె       ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ
వానలోన వనుకుడాయె            ”   ”   ”     ”
సలిలోన సచ్చుడాయె               ”   ”   ”     ”
బండలోలె బతుకుడాయె            ”   ”   ”     ”
గాడ్దివోలె చాకిరాయె గంజినీల్లు దొరకవాయె       “ఇస్సోయ్”

సాకలోల్ల బతుకులన్ని      ఇస్సోయ్ ఇస్సోయ్ రంగ
సాకిరేవు కతలన్ని                   ”   ”   ”     ”
దోపిడిని కూల్చెవరకు               ”   ”   ”     ”
మారబోవు తీరబోవు                ”   ”   ”     ”
బండరాల్లు దోపిడోల్ల గుండెపైకి ఇసరాలె    “ఇస్సోయ్” 29/8/1983
(పల్లవి, దాదాపు ఒక చరణం అందించిన తిర్మల్ కు, పూర్తిగా ఒక చరణం రాసిన కానూరి తాత గారికి ఈ పాట రుణపడిఉంటుంది)


గబగబా నడవరో కోయదాదా


గబగబా నడవరో కోయదాదా హై
నువ్వు పోరుజేయ నడవరో కోయదాదా హై..  “గబగబా”

పొద్దుమాపు కష్టపడి పోడేమో నరుకుతావు
రాల్లన్నీ ఏరుతావు నేల చదను చేస్తావు
పోడుభూమి కొరకు నీవు పట్టాలు అడిగితేను
పోలీసులు పట్టుకెల్లి పొట్టుపొట్టు గొడుతుండ్రు.. “గబగబా”

కాల్లల్లో ముల్లు దిగిన వల్లంతా గీరుకున్న
వెదురుకూపుల కెల్లి వెదురుబొంగు నరుకుతావు
లారి లోడ్ కెక్కించి కంట్రాక్టరు కప్పచెబితే
కంట్రాక్టరు గాడేమె కూలి ఎగదొబ్బుతుండు.. “గబగబా”

యిప్పపువ్వు యిప్పగింజ కుంకుళ్ళు పళ్ళు తేనె
చింతపండు దులుపుకొని తవిసబంక తీసుకొని
అడివిలోని సంపదంత మైళ్ళు మైళ్ళు మోసుకొచ్చి
కార్పరేషను కిస్తేను రోజుకూలి రాదాయె.. “గబగబా”

కట్టెపుల్లలేరుకొస్తే కోడిపిల్లలెత్తుకెల్లె
మేకపుల్లరి దొబ్బి మనుబోతులాగ బలిసె
సారెదారు చౌకిదారు సత్తువంత గుంజుతుండ్రు
రేంజరు గాడేమొ మన రక్తాన్ని తాగుతుండు.. “గబగబా”

కాంట్రాక్టు జేసెటోడు నాటలేదు ఈ అడవి
ఫారెస్టు రేంజరోడు పెంచలేదు ఈ అడవి
అడవిలోని సొత్తంతా ఎవడబ్బా ముల్లెగాదు
అడివిలోన పెరిగినోడ అడివి పైన హక్కు నీది.. “గబగబా”

రోజుకూలి లేనోడ రేచులాగ లేవరన్న
పూటకింత లేనోడ పులిలాగ లేవరన్న
సచ్చుకుంట బతికెటోడ సింహమోలె లేవరన్న
అడవితల్లి బిడ్డడా అగ్గిలాగ మండరన్న.. “గబగబా” 20/5/1983







అమ్మబాబో మన హాస్టలన్నా


అమ్మబాబో మన హాస్టలన్నా
దీని కన్నా బందెలదొడ్డి మిన్నా..            “అమ్మబాబో”

ఓ.. కంపుగొట్టే దొడ్లురన్న కూలుతున్న షెడ్లురన్న
పై కప్పు చిల్లులన్న నేలంతా గుంటలన్న
సొట్టబడ్డ పెట్టెలన్న సినిగిన దుప్పట్లురన్న
దుప్పట్లో నల్లులన్న గుమ్మంలో పందులన్న      “అమ్మబాబో”

ఓ.. వర్షకాలమొస్తెరన్న హాస్టలొక చెరువురన్న
గుయ్యిగుయ్యి దోమలన్న బుయ్యిబుయ్యి ఈగలన్న
కుక్కల చెలగాటమన్న పిల్లల కిరకాటమన్న
కప్పల బెకబెకలురన్న పాముల బుసబుసలురన్న “అమ్మబాబో”

ముక్కీన అన్నమన్న రాల్లున్న పప్పురన్న
పుచ్చీన కూరలన్న పులుపు లేని చారురన్న
మంచినూనె సున్నరన్న మంచినీల్లు కరువురన్న
నీసుకూర లేనెలేదు రోస్టు అంటె ఎరికె లేదు       “అమ్మబాబో”

ఇది ఏమి తిండాని ఎదురుతిరిగి మేమంతా
వంటవాడి నడగబోతె వార్డెన్ను అడగమానె
వార్డెన్ను అడగబోతె గవర్నమెంటు గట్లనండు
గవర్నమెంటు నడగబోతె గన్నులెక్కు పెడుతుండ్రు.. “అమ్మబాబో”

ఎన్నాల్లు గడ్చినాను సబ్బులేమె రాకపోయె
వంటిపైన మురికి పోక వల్లంతా దురదబుట్టె
గోకిగోకి అందరికి గజ్జేమొ పుట్టబట్టె
గజ్జి తగ్గనీకి మేము ఆసుపత్రి కెల్లితేను
గజ్జి తగ్గుడేమొ కాని తామర కూడ అంటబట్టె “అమ్మబాబో”

వచ్చె ఇంత సొమ్ములోనె వార్డెను వాటా కొంత
సబ్బూల డబ్బులన్ని సుబ్బరంగ మెక్కినాడు
నూనె డబ్బలమ్ముకుని నిగనిగ లాడుతుండు
నోటు బుక్సునమ్ముకుని సూటును గుట్టించుకుండు
బియ్యం బస్తలమ్ముకొని బంగ్ల గట్టించుకుండు
గవర్నమెంటు గ్రాంట్లు మెక్కి గొడ్డులాగ బలిసినాడు “అమ్మబాబో”

బి.సి ఎస్.సి ఎస్.టి వోల్లు గవర్నమెంటు కిష్టమాని
రుజువు చేసెటందుకె రిజర్వేషను పెట్టామని
ఎంగిలి మెతుకులాను ఇసురుతుంది గవర్నమెంటు
పేదప్రజల బాగు అంటు ఫోజులెన్నొ కొడుతుంది
వెల్ ఫేర్ హాస్టలెట్టి కిల్ ఫేర్ చేస్తుంది..           “అమ్మబాబో”  16/5/1983







Thursday, April 12, 2012

ఏమి చేద్దాం ఏమి చేద్దాము

ఏమి చేద్దాం ఏమి చేద్దాము
జనులార మనము
ఏమి చేద్దాం ఏమి చేద్దాము..

గంగిగోవు పాలుదెచ్చి లింగపూజలు చేద్దమంటె
గుడిని లింగాన్ని మింగె లంగగాళ్ళు బయల్దేరిరి – ఏమి
గంగిగోవు పాలు మింగె లింగపూజలు వద్దురన్న
తనను మింగె దొంగలాను తరమలేని లింగడెందుకు
పోరు చేద్దాం పోరు చేద్దాము
జనులార మనము
పోరు చేద్దాం పోరు చేద్దాము..

ఏడు ఏడు కొండలెక్కి ఎంకటేసుకు మొక్కితేను
దుడ్డులిచ్చి లడ్డుకొంటె సీకులొచ్చొ మేకులొచ్చె – ఏమి
కలియుగ వైకుంఠమైనా కల్తీలేని చోటు కాదు
దేవుడె ఒక కల్తి సరుకు భక్తి దానికి పెద్ద సోకు – పోరు

నల్ల బట్టలు వేసుకుంటడు ఆలినేమె వల్లనంటడు
స్వామియే అయ్యప్ప అంటూ శబరిమలకు సాగిపోతడు
ఈతిబాధలు పక్కనెట్టి రోతబాటను నడుస్తున్నడు
బాధలన్ని తీరుదారి పోరుబాట నడుద్దాము

తోక వెనుక ఉన్నవాడు కోకలెత్తుకు ఎల్లినోడు
ఆలినడివికి పంపినోడు అందరూ దేవుళ్ళె మనకు
ఎందరూ దేవుళ్లు ఉన్నా మందికి ఒరిగేది సున్న
దేవుడైనా రావుడైనా దండిగ ఉన్నోడికేరా

పొందులేక పుట్టినోడు ప్రభువు ఏసు చర్చికెళితె
కోతల పండుగ అంటూ కోళ్లు గొర్రెలు మింగినారు
శిలువ ఎక్కి ఏసుక్రీస్తు నిండుప్రాణం బలిని చేస్తే
ఏసుపేరుతో ప్రీస్టుస్వాములు మందిసొమ్ము మింగుతుండ్రు

అల్లహో అక్బరు అంటడు అయిదు సార్లు నమాజ్ చేస్తడు
తలాక్ తలాక్ తలాకంటడు మళ్ళి పెళ్ళికి తయారవుతడు
ఆడదాన్ని అబల చేసి అణిచివేయ చూసె మతము
మతాలన్నిటి ధర్మమొకటె కులాలన్నిటి గోత్రమొకటె

డార్విను థీరి చెప్పి దేవునికి మొక్కుతాడు
సైన్సు చదివిన బుద్ధిహీనుడు సాయిబాబ కాళ్లు పడతడు
గుడ్డి చదువుకు గుణం మారునా సైన్సు చదివిన సెన్సు వచ్చునా
బట్టిపట్టే రొట్టచదువులు తీరు మార్చ పోరు చెయ్యి

అందమైన నగరమాని అయిదరబాదు చూడబోతె
ముక్కు మొకము తెల్వనోడు ఒక్కపోటు పొడిచిపాయె
దోపిడికి అడ్డుతెరగ మతం మంటలు రేపుతుండ్రు
హిందుముస్లిం భాయిభాయని దోపిడిపై దాడి చేయరా

భారతీయ సంస్కృతాని గొంతుచించే వంతగాళ్లు
భారతమ్మను అమ్ముకునే బట్టెబాజిల చెంతచేరిరి
పాత గోరిల్ తవ్వితేను ఎండుబొక్కలు దొరుకునన్న
కొత్తసంస్కృతి కొరకు నువ్వు కత్తివోలె మెరవరన్న            8/3/1983