నీళ్లోయ్ నీళ్లోయ్ నీళ్ళు.. నీళ్ళ కోసం పొతే కన్నీళ్లు.. “నీళ్లోయ్”
ఏ జిల్లా చూడు ఏ పల్లె చూడు గొల్లుమంటున్నాయి నీళ్ళు నీల్లంటూ
మైళ్ళు మైళ్లు నడిచి కాళ్ళు బొబ్బాలాయే ఊళ్ళ కూళ్ళు ఎక్కి ఎక్కిళ్ళు పెట్టాయే
ఎండిపోయిన ఏరు గుండెను తవ్వి ఏడు అడుగుల లోతు సెలిమే తీసి
చుక్క నీటి కోసమెన్ని ఇక్కట్లో గుక్క తాగితే మొదలు కక్కుళ్ళు
తడారే కళ్ళు పొడారే పెదవులు ఎడారి రాష్ట్రం ఎండాకాలం వస్తే “నీళ్లోయ్”
టాంకులు లేనోళ్ళు టాంకర్లు రానోళ్ళు గల్లి గల్లికి ఒక్క నల్లైన లేనోళ్ళు
పంపు నీళ్ళ కొరకు పడిగాపులన్న ప్రపంచయుద్ధాలు ప్రతి బస్తిలోన
డబ్బాడు నీళ్ళకు రోజుకూలి పాయె పాకెట్టు నీళ్ళకు పర్సు ఖాలీ ఆయే
కాళ్ళకు నీళ్ళిచ్చే కల్చరు పాయే మంచినీల్లడిగితే మర్యాద పాయె
స్నానాలు జపాలు దేవుని కెరుక ఆకుల్తో తుడిచే ఆదికాలం వచ్చే “నీళ్లోయ్”
అడవుల్ని నరికారు కొండల్ని తవ్వారు ఇసుక తిన్నెలన్నీ కసకసా నమిలారు
నదులన్నీ కన్నీళ్ళ చారలై మిగిలాయి కబ్జాలో చెరువులు మాయమై పోయాయి
బోర్లు బోర్లు తవ్వి బావులే ఎండాయి భూతల్లి పొదుగులు వట్టిపోయాయి
ఇంకుడు గుంటల్ని ఇంటింట తవ్వాలి చెరువుల్ని నదులను బతికించుకోవాలి
నీళ్ళ తోటే బతుకు నీళ్ళ తోటే మెతుకు నీళ్ళు లేకుంటే నరకమే మనకు “నీళ్లోయ్”

No comments:
Post a Comment